PM Modi Speech | తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని మోదీ స్పష్టంచేశారు. ఎల్బీ స్టేడియంతో తనకు అనుబంధం ఉందని.. పదేళ్ల క్రితం ఈ స్టేడియంలో ప్రజలు ఆశీర్వదించడంతో తాను ప్రధాని అయ్యానని మోదీ తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సభలో మోదీతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) కూడా వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. “దేవి సమక్క, సారలమ్మకి జై. యాదాద్రి నరసింహస్వామికి జై. నేను కుటుంబం మధ్యన ఉన్నట్లు అనిపిస్తోంది. సభకు వచ్చిన తెలంగాణ బంధువులకు నమస్కారాలు. బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ నేలతో నాకు విడదీయలేని అనుబంధం ఉంది” అని మాట్లాడారు. దీంతో స్టేడియం అంతా చప్పట్లతో మార్మోగింది.
తొమ్మిదేళ్లుగా తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వ్యతిరేక ప్రభుత్వం ఉందనన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు జరగలేదన్నారు. దివంగత నేత అబ్దుల్ కలాం(Abdul Kalam), ద్రౌపది ముర్ములను(Droupadi Murmu) రాష్ట్రపతిని చేసిస ఘనత తమదే అని.. అలాగే లోక్ సభలో తొలి దళిత స్పీకర్ బాలయోగిని చేసింది కూడా నాటి ఎన్డీఏ ప్రభుత్వమేనని మోదీ వెల్లడించారు. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల లక్షణాలు అని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలకు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుతో సంబంధాలు ఉన్నాయంటూ కవితను ఉద్దేశిస్తూ పరోక్ష ఆరోపణలు చేశారు. అవినీతిపరులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని మోదీ హెచ్చరించారు.
PM Modi Speech | ఇక ఈ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ సాధించినా నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందని పరిస్థితి ఉందని విమర్శించారు. సామాజిక తెలంగాణ… బీసీ తెలంగాణకు తాను పూర్తిగా మద్దతిస్తున్నానన్నారు. ప్రధాని మోదీ ఎన్నికలనే దృష్టిలో పెట్టుకొని ఉంటే ఆర్టికల్ 370ని రద్దు చేసేవారు కాదన్నారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ఉగ్రవాద దాడులు తగ్గాయని వివరించారు. తనలాంటి కోట్ల మంది కన్న కలలకు ప్రతిరూపమే మోదీ అన్నారు. ఔర్ ఏక్ బార్ మోదీ అంటూ పవన్ నినదించారు.