PM Modi will visit Telangana on February 13: ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 13న ప్రధాని మోడీ హైదరాబాద్ కు రాబోతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొననున్నారు. నిజానికి మోడీ ఈ నెల 19న రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే వందే భారత్ రైలును ఆయన చేతులమీదుగా ప్రారంభించేందుకు అధికారులు షెడ్యుల్ ఖరారు చేశారు. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా తన పర్యటన వాయిదా పడింది. అనంతరం వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ఈ నెల 15న వర్చువల్ విధానంలో మోడీ జెండా ఊపి ప్రారంభించారు.
కాగా బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో ఆవిర్భవించిన అనంతరం తొలిసారి రాష్ట్రానికి మోడీ(PM Modi) రాబోతున్నారు. దీంతో ఈసారి మోడీ స్పీచ్ పై ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠ మారింది. గతేడాది నవంబర్ లో హైదరాబాద్ బేగంపేటలో నిర్వహించిన బీజేపీ సభలో మోడీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై స్ట్రాంగ్ విమర్శలు చేశారు. అవినీతి, కుటుంబ పాలన కారణంగానే తెలంగాణలో అభివృద్ధి జరగడం లేదని ధ్వజమెత్తారు. పేదలను దోచుకునే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కాగా రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్రత్యేక కార్యచరణను నిర్ణయించుకుంది. ఇందుకు ‘మిషన్ 90 తెలంగాణ 2023’ అని పేరు కూడా పెట్టుకుంది. ఈ టార్గెట్ తోనే ఎన్నికలను ఎదుర్కొవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ను ఇరుకున పెట్టేలా ప్రధాని మోడీ టార్గెట్ స్పీచ్ ఉండబోతోందా అనేది ఆసక్తిగా మారింది.