Telangana Elections | తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు మాత్రం అధికారులు అనుమతి ఇస్తున్నారు. పలు కేంద్రాల్లో భారీగా ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా మిగిలిన చోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. నగరాల కంటే గ్రామాలు, పట్టణాల్లో ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో మాత్రం ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదైంది.
Telangana Elections | మరోవైపు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, పినపాక, ఇల్లందు, భద్రాచలం, సిర్పూర్ టీ, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు, అశ్వారావుపేట, కొత్తగూడెం, ములుగులో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. తెలంగాణలో పోలింగ్ ముగియడంతో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. డిసెంబర్ 3న తెలంగాణతో పాటు మిజోరం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఫలితాలు వెల్లడికానున్నాయి.