Raghunandan Rao Reacts to Mallareddy Comments : మల్లారెడ్డి తన ఫోన్‌ను చెత్తబుట్టలో ఎందుకు దాచిపెట్టారని బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు ప్రశ్నించారు. ఐటీ దాడులపై రాజకీయ కోణాన్ని ఆపాదించడం సరికాదని పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. మల్లారెడ్డి ఫోన్లు దాచిపెట్టుకున్నారంటేనే ఏదో జరిగిందని అర్థమవుతోందని అభిప్రాయపడ్డారు. ఆరోగ్యం ఉన్న వ్యక్తులకు ఐటీ, ఈడీ నుంచి నోటీసులు రాగానే గుండెనొప్పి ఎందుకు వస్తుందో? అని అన్నారు. మల్లారెడ్డి దగ్గర పనిచేసినవారే ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చారని తెలుస్తోందని.. అందులో భాగంగానే తనిఖీలు చేపట్టారని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమేనని..తనకు నోటీసులు వచ్చినా తను సహకరిస్తానని.. అంతేకానీ, వాటికి రాజకీయ కోణాలను ఆపాదించవద్దని మంత్రి మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లకు సూచించారు. తన కొడుకును కొట్టారంటూ మల్లారెడ్డి ఆరోపణలు చేయడం సరికాదన్నారు.