రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావుపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ.. హరీశ్ రావు దుబ్బాకపై కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోకుండా మంత్రి హరీశ్ రావు(Harish Rao) వారి పేరిట రాజకీయం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. మంత్రి స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని, రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే పంట నష్టపరిహారానికి సంబంధించిన జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయాలని అడిగితే కేంద్రం నుంచి డబ్బులు తీసుకురావాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్రం నేరుగా దుబ్బాకకు నిధులు ఇవ్వదని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి నిధులు ఇస్తుందనే విషయం కూడా తెలియదా.. ? అని ప్రశ్నించారు. కేంద్ర విపత్తు సహాయ నిధుల ద్వారా రాష్ట్రానికి వచ్చిన డబ్బులతో పరిహారం చెల్లించాలని రఘునందన్ రావు(Raghunandan Rao) కోరారు.