ఛలో నల్గొండ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) కౌంటర్ ఇచ్చారు. శాసనసభలో ప్రాజెక్టులపై చర్చ చేపడితే మాత్రం కాళేశ్వర్ రావు రారని ఎద్దేవా చేశారు. ఇంటి పక్కనే ఉన్న అసెంబ్లీకి రాకుండా నల్గొండకు పోయి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఎన్ని వేషాలు వేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కృష్ణా నది జలాల ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించారని కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని రేవంత్ తెలిపారు.
అంతకుముందు మేడిగడ్డ బ్యారేజ్‌ను రేవంత్ బృందం పరిశీలించింది. అనంతరం అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్(Revanth Reddy) మాట్లాడుతూ “కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)కు ఏడాదికి విద్యుత్ బిల్లులు 10వేల 500 కోట్లు.. ఇప్పటివరకు అయిన ఖర్చుకు ఇక నుండి ప్రతి ఏడాది.. 20వేల కోట్లు మిత్తి, అసలు ఇన్ స్టాల్ మెంట్ కడితే అయ్యే ఖర్చు. ఇప్పటివరకు లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు. కాళేశ్వరం ద్వారా 19,63,000 ఎకరాలు మాత్రమే ఆయకట్టు ప్రతిపాదన. కేసీఆర్.. కోటి ఎకరాలకు నీళ్ళు అనడం పచ్చి అబద్దం. ఇప్పటివరకు 94వేల కోట్లు ఖర్చు చేశారు. అంతా పూర్తైతే.. ప్రతి ఏటా రెండున్నర లక్షలు ఖర్చు చేస్తే.. 19లక్షల ఎకరాలకు నీళ్లు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కూలింది. లక్ష కోట్లు ఖర్చు చేస్తే.. లక్ష ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు.
మేడిగడ్డలో 85 పిల్లర్స్. 7 బ్లాక్‌లో పిల్లర్స్ కుంగాయి. డిజైన్, నిర్వహణ, కాంట్రాక్ట్ పనుల్లో నాణ్యత లోపం ఉందని డ్యాం సేఫ్టీ అథారిటీ చెప్పింది. 2020లోనే నాణ్యతా లోపం ఉందని ఇరిగేషన్ అధికారులు గుర్తించి ఎల్ అండ్ టీ కి లేఖ రాసినా పట్టించుకోలేదు. 2020లోనే మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage)లో సమస్య ఉందని అధికారులు ఎల్ అండ్ టీ సంస్థకు లేఖ రాశారు. 2023 అక్టోబర్ లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు వచ్చి పరిశీలించి లోపం ఉన్నట్లు చెప్పారు. 6 రకాల టెస్టులకు సూచించారు. ఇప్పుడు మేడిగడ్డ, సుందిల్లా, అన్నారంలలో ఎక్కడా నీళ్లు లేవు. నీళ్లు స్టోర్ చేస్తే అసలు రంగు బయటపడుతుంది. నీళ్లు స్టోర్ చేస్తే ఇంకా ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో బయటపడతాయి” అని చెప్పుకొచ్చారు.