ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ ఏరియాలు నీట మునిగి ప్రజల జీవన విధానం ఆగమైంది. తాజాగా.. వర్షాలు, వరదలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పందించారు. వర్షాలు కురుస్తాయని, వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందస్తుగానే హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు.
వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అయిందని, ప్రభుత్వం ముందుగానే ప్రజలను అప్రమత్తం చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వరదలపై సమీక్ష నిర్వహించకుండా.. రాబోయే ఎన్నికలపై దృష్టి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఆగమైపోతుంటే.. ఈ పరిస్థితిలో పార్టీలో చేరికలు చేసుకుంటూ సీఎం బిజీగా ఉండటం ఏంటి అని ప్రశ్నించారు. అసలు ముఖ్యమంత్రికి బాధ్యత ఉందా? అని రేవంత్ రెడ్డి(Revanth Reddy) అడిగారు.
పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. వెయ్యి కోట్లు విడుదల చేయించాలని కిషన్ రెడ్డి(Kishan Reddy)కి సవాల్ విసిరారు. గతేడాది కూడా వరద సాయం ప్రకటించడంలో కేంద్రం తెలంగాణపై చిన్నచూపు చూసిందని అన్నారు. వరదసాయం తీసుకురావాల్సిన బాధ్యత కిషన్ రెడ్డిదే అని సూచించారు. తెలంగాణలో ప్రభుత్వం చచ్చిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.