మూసీ నది ప్రక్షాళన(Musi Rejuvenation)పై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. పోర్ట్ ఆఫ్ లండన్ అధికారులు, థేమ్స్ నది పాలకమండలి అధికారులు, నిపుణులతో భేటీ అయ్యారు. మూసీ నది పునరుజ్జీవనం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలను వారితో చర్చించారు. ఈ భేటీలో మూసీ నదిని పునరుజ్జీవింపజేసే ప్రయత్నంలో తెలంగాణ ప్రభుత్వానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని థేమ్స్ నది పాలక సంస్థ పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ హామీ ఇచ్చింది.
మూసీనది పునరుద్ధరణ(Musi Rejuvenation), సుందరీకరణ చేయడం ద్వారా హైదరాబాద్ నగరంలోని ప్రజలకు, చెరువులకు నీటి సరఫరా సులభం అవుతుంది. అదే విధంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి అని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేథ్యంలోనే మహానగరంలో మూసీ నది ప్రారంభమయ్యే ప్రాంతం నుండి చివరివరకు మొత్తం నది పరీవాహక ప్రాంతాన్ని ఉపాధి, ఆర్థికాభివృద్ధి మండలంగా తీర్చిదిద్దాలని కొద్దిరోజుల క్రితం అధికారుల సమావేశంలో CM స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇక ఇదే అంశంపై నేడు పోర్ట్ ఆఫ్ లండన్ అధికారులతో చర్చలు జరిపారు. మూసీ నది ప్రక్షాళనకు వారి సహకారం ఉంటుందని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చారు.