కీలక డిమాండ్ తో కేసిఆర్ కి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

-

దేశవ్యాప్తంగా బీసీ కుల గణన డిమాండ్ మొదలైంది. బీహార్ లో కుల గణన సర్వే ఫలితాలు ఈ డిమాండ్ కి మరింత బలాన్ని చేకూర్చాయి. బీహార్ లో చేపట్టిన ఈ కుల గణన దేశ రాజకీయాలను ప్రభావితం చేయనున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ చేపట్టిన సర్వేలో బీసీలు అత్యధికంగా 63% ఉన్నట్లు తేలింది. సర్వే ఫలితాలకు అనుగుణంగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజకీయ కార్యాచరణకు అడుగులు వేయనున్నారు. ఇక ఓబీసీల ఓటింగ్ పై ఆశలు పెట్టుకున్న విపక్షాలు కూడా దేశవ్యాప్తంగా కుల గణనకు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘బీసీ కుల గణన’ కు డిమాండ్ చేస్తూ తెలంగాణ సీఎం కేసిఆర్ కి TPCC చీఫ్ రేవంత్ రెడ్డి( Revanth Reddy ) బహిరంగ లేఖ రాశారు. ఆయన రాసిన లేఖ సారాంశం కింద యధాతధంగా ఉంది చదవవచ్చు.

- Advertisement -

రేవంత్ రెడ్డి(Revanth Reddy) లేఖ యధాతధంగా…

బీసీ కుల గణన గురించి బీసీ జనగణనతోనే బీసీ వర్గాలకు సమన్యాయం జరుగుతుందని ఆయా వర్గాలు భావిస్తున్నాయి. ఆ దిశలో బీసీ కుల గణన చేపట్టాలని సుదీర్ఘ కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. న్యాయంగా తమకు దక్కాల్సిన వాటా కోసం ఆయా సామాజికవర్గాలు చేస్తున్న బీసీ జనగణన డిమాండ్ కు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. ఈ విషయంలో బీసీ సంఘాలు చేపట్టిన ప్రతి నిరసన, ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. మహిళా బిల్లును పార్లమెంటులో ఆమోదించిన సమయంలో కూడా మా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా ఇండియా కూటమిలోని భాగస్వామ్యులైన జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ పార్టీలతో కూడిన నితీశ్ కుమార్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం బీహార్ రాష్ట్రంలో బీసీ జనగణనను విజయవంతంగా చేపట్టింది. ఆ వివరాలను నిన్న విడుదల కూడా చేసింది.

స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని, సామాజిక-ఆర్థిక-రాజకీయ న్యాయాన్ని దేశ ప్రజలందరికీ అందిస్తామనే ఆశయాన్ని రాజ్యాంగం ప్రకటించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటుతున్నా జనాభాలో సగ భాగమైన బీసీల పరిస్థితిలో ఏ మార్పు లేదు. ఎవరి కుల దామాషా ప్రకారం వారు హక్కులు పొందటమే ప్రజాస్వామిక సామాజిక న్యాయం అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన. అరుదైన పక్షి, జంతు జాతులను రక్షించడం కోసం ప్రభుత్వాలు వాటి లెక్కలు తీస్తున్నాయి. కానీ, దేశ జనాభాలో సగం కన్నా ఎక్కువ ఉన్న బీసీల జనాభా ఎంతో తెలియదు. దేశంలో బీసీల జనాభా ఎంత ఉన్నదని తెలుసుకోవటానికి నేటికీ.. బ్రిటీష్‌ వారి హయాంలో జరిగిన జనాభా లెక్కలే ప్రామాణికంగా కొనసాగుతుండటం దురదృష్టకరం. ఫలితంగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన బీసీ వర్గాలు నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ కుల గణనతోనే బీసీ వర్గాలకు న్యాయం జరుగుతుంది.

బీసీ కుల గణనతో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ ‌15, 16 ప్రకారం విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు కల్పించిన రిజర్వేషన్‌‌ మరింత కట్టుదిట్టంగా అమలు చేసే అవకాశం ఉంటుంది. ఆయా సామాజిక వర్గాలకు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసే అవకాశం ఉంటుంది. జనాభాకు అనుగుణంగా విద్య, ఉద్యోగ, సామాజిక రంగాల్లో వెనుకబడిన వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం సాధ్యమవుతుంది. ఇప్పటి వరకు రిజర్వేషన్ ఫలాలు అందుకోలేని ఎన్నో వందల కులాలను వెలుగులోకి తీసుకురావచ్చు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం బీసీ జనగణన డిమాండ్ ను పట్టించుకోవడం లేదు.

బీసీనని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన మోదీ కూడా బీసీల న్యాయమైన డిమాండ్ ను నేరవేర్చడానికి చొరవ చూపకపోవడం అత్యంత దురదృష్టకరం. దేశంలో సగానికి పైగా జనాభా వున్న బీసీల విషయంలో కేంద్రం లెక్కలేనితనం చూపడం దారుణమైంది. దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారు? వీళ్ల ఆర్థిక స్థితి గతులేమిటి? వీరి చదువులు ఎలా వున్నాయి? వీరి ఉద్యోగ అవకాశాలేమిటి? దారిద్య్ర రేఖకు దిగువన ఉండటానికి కారణాలు ఏమిటి? బీసీలలో ఇంకా సంచారజాతులుగా వున్న వారి దీనస్థితికి విముక్తి ఎప్పుడు? ఈ సమాచారం లేకుండా దేశాభివృద్ధికి వ్యూహాలు రచించడం కష్టం. అందుకే బీసీ జన గణన అత్యంతావశ్యం.

ఘనత వహించిన మీ ప్రభుత్వం కూడా బీసీ సంక్షేమాన్ని గాలికొదిలేసింది. బీసీలకు ఎంతో చేస్తున్నామని చెప్పుకోవడమే తప్ప చేసింది శూన్యం. బీసీ సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీ తెస్తామన్నా మాట ఉత్తముచ్చటగా మిగిలిపోయింది. ప్రభుత్వంలోనే కాకుండా కేవలం 20 సీట్లు మాత్రమే ఇచ్చి రాజకీయంగా కూడా బీసీలను అణగదొక్కలనే కుట్రలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో జనాభాలో ఎంతమందిమి ఉన్నామో తెలిస్తే… ఆ నిష్పత్తిలో రిజర్వేషన్లు పొందవచ్చని, సామాజిక న్యాయం జరుగుతుందని బీసీ సామాజికవర్గాలు భావిస్తున్నారు. అందుకే బీసీ జన గణన చేపట్టాలని దీర్ఘ కాలంగా వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనాభా దామాషా ప్రకారం బీసీలకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా వారికి న్యాయంగా దక్కాల్సిన వాటా కావాలంటే బీసీ జనగణనతో సాధ్యమవుతంది. కాబట్టి బీహార్ మాదిరిగా మీ ప్రభుత్వం కూడా తక్షణమే బీసీ జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నా. అంతేకాకుండా 2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను బయటపెట్టాలి. అప్పుడే సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో బీసీలకు న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కుతుంది.

ఎ. రేవంత్ రెడ్డి(Revanth Reddy),

ఎంపీ – మల్కాజ్ గిరి,

టీపీసీసీ అధ్యక్షుడు.

Read Also: కొవిడ్ 19 వ్యాక్సిన్… ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Chewing Food | ఆహారాన్ని వేగంగా తినేస్తున్నారా.. ప్రమాదంలో పడినట్లే..!

Chewing Food | ప్రస్తుత పరుగుల ప్రపంచంలో చాలా మందికి ఆహారం...

KTR | బీజేపీ గెలుపుకి ప్రాంతీయ పార్టీలే కారణం: కేటీఆర్

మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి సాధించిన ఘన విజయంపై బీఆర్ఎస్ వర్కింగ్...