తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్(Sajjanar) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. డీలాపడ్డ ఆర్టీసీని గాడిన పెట్టడానికి కూడా వినూత్నంగా సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. దీంతో యూత్ లో ఆయనకి నెట్టింట ఫాలోయింగ్ కూడా బాగా పెరిగిపోయింది. అయితే ఆయన తన ట్విట్టర్ ఖాతాలోని అభిమానులతో అప్పుడప్పుడు సామాజికపరమైన అంశాలను, వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. యువతకి సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఓ యువతి వీడియోని ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ యువత పోతున్న విపరీత పోకడలపై అసహనం వ్యక్తం చేశారు.
కొన్నేళ్లుగా సోషల్ మీడియా(Social Media) పిచ్చితో కొందరు యువతీయువకులు వెర్రి వేషాలు వేస్తున్నారు. వైరల్ అవ్వాలనే ఆశతో ఒక్కోసారి తమ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. రోడ్లపైనే రీల్స్, యూట్యూబ్ షాట్స్ పబ్లిక్ ప్లేసుల్లో వీడియోలు షూట్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. తాజాగా ఓ యువతి ఇదే తరహాలో రోడ్డు మధ్యలో డాన్స్ చేస్తూ ట్రాఫిక్ కి అంతరాయం కలిగించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇప్పుడు ఆ వీడియోనే సజ్జనార్(Sajjanar) కి బాగా కోపం తెప్పించింది.
దీనిపై స్పందిస్తూ “నేటి యువతకు ఇన్‌స్టా రీల్స్(Insta Reels), యూట్యూబ్ షార్ట్స్(youtube Shorts) పిచ్చి పట్టుకోవడం బాధాకరం. సమాజానికి పనికి వచ్చే పనులు చేసి నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన యువతరం.. సోషల్ మీడియా మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకుంటోంది. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాపులర్ కావడం కోసం నడి రోడ్డుపై ఇలాంటి వెర్రి చేష్టలు చేస్తూ.. ఇతరులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడం ఏం ఆనదంమో.. ఏమో!?” అంటూ ఆర్టీసి ఎండీ సజ్జనార్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఈ ట్వీట్ లో వైరల్ అవుతున్న వీడియోని కూడా జత చేశారు. దీంతో వీడియో చూసిన నెటిజన్లు కూడా సదరు యువతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారికి తగిన శిక్ష పడాలంటూ మండిపడుతున్నారు.
నేటి యువతకు ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ పిచ్చి పట్టుకోవడం బాధాకరం. సమాజానికి పనికి వచ్చే పనులు చేసి నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన యువతరం.. సోషల్ మీడియా మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకుంటోంది. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాపులర్ కావడం కోసం నడి రోడ్డుపై ఇలాంటి వెర్రి… pic.twitter.com/RQ6aGEWUet
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 24, 2023