హైదరాబాద్‌లోని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ పార్టీదే అధికారం అని వెల్లడైంది. దీంతో రేవంత్ రెడ్డి నివాసం వద్ద భద్రత పెంచారు. గతంలో కంటే అధిక సంఖ్యలో పోలీసులను మోహరించారు. పోలింగ్ అంచనాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండడంతో నేతలు రేవంత్ ఇంటికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాంగ్రెస్(Congress) గెలిస్తే సీఎం అభ్యర్థి రేవంత్ అనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో ఆయన నివాసానికి పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఆధారంగా భద్రత పెంచినట్టు తెలుస్తోంది.
మరోవైపు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాంటూ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ట్వీట్ చేశారు. గడచిన పదేళ్లుగా అడుగడుగునా అణచివేతలు, దాడులు, కేసులకు వెవరకుండా కాంగ్రెస్ చేసిన పోరాటంలో మీరంతా ప్రజల పక్షాన నిటారుగా, నికార్సుగా నిలబడ్డారని కొనియాడారు. మీ కష్టం, శ్రమ వృథా కాలేదని చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో మీ అందరి పాత్ర మరువలేనిదని.. ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నానని వెల్లడించారు.