SIT investigation on Farmhouse MLAs Case: తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ వేగం పెంచింది. తెలంగాణలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్ర చేస్తుందనీ.. అందులో భాగంగానే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని టీఆర్‌ఎస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే ఈ కేసులో నిజనిజాలు వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురిని తీసుకుని, సిట్ అధికారులు విచారణలో పలు కీలక విషయాలను రాబట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న రామచంద్ర భారతికి హర్యానా, కర్ణాటకలలో ఉన్న నివాసాల్లో సిట్ సోదాలు చేస్తోంది. తిరుపతిలోని సింహయాజి స్వామిజీ ఆశ్రమంలో తనిఖీలు నిర్వహించారు.
కేరళలోని కొచ్చిలో ఓ వైద్యుడు రామచంద్రభారతికి మధ్యవర్తిగా వ్యవహరించినట్లు గుర్తించి.. సదరు వైద్యుడి ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. సింహయాజీ స్వామిజీ తిరుపతి నుంచి హైదరాబాద్‌కు రావటానికి ఓ జాతీయపార్టీకి చెందిన నేత బంధువు అతడికి టికెట్ బుక్ చేసినట్లు అధికారులు గర్తించారు. దీంతో ఈ కేసులో, ఆ జాతీయ పార్టీకి సంబంధం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌లో నందకుమార్ ఇల్లు, హోటల్‌లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
కాగా, మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి కచ్చితంగా గెలుస్తాడనీ, ఈవీఎంలను హ్యాండల్ చేస్తామని ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో లీక్ అయిన వీడియోల్లో స్పష్టంగా ఉంది. రాజగోపాల్ రెడ్డి గెలిస్తే, బీజేపీ ఈవీఎంలను హ్యాండల్ చేస్తుందన్న నిజం బయటపడుతుందనే.. టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, ఎంతమందిని అరెస్టు చేస్తారో చూడాలి.