తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో ఒక్కొక్కరుగా కీలక నేతలంతా పాదయాత్రలకు పూనుకుంటున్న తరుణంలో వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కాగా, తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, హంగ్ ఏర్పడే అవకాశం ఉందని ఎంపీ వెంకట్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. అధికారం కోసం చివరి నిమిషంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలవక తప్పదన్నారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణలో ఈ సారి ఏ పార్టీకీ మెజార్టీ రాదని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) పార్టీలు సెక్యులర్ పార్టీలన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా స్వంతంగా 60 సీట్లు దక్కవన్నారు.
తన రాజకీయ అనుభవంతో ఈ విషయం చెబుతున్నట్టుగా వ్యాఖ్యానించారు. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటాడని కోమటిరెడ్డి(Komatireddy Venkat Reddy) చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా అధికారంలోకి వచ్చే చాన్స్ లేదని, బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం కూడా లేదని, అందుకే అధికారం కోసం చివరి నిమిషంలో బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకునే చాన్స్ ఉందని జోస్యం చెప్పారు. అంతేగాక, ఎన్నికలకు కనీసం ఏడాది ముందే 60 మంది అభ్యర్ధులను ప్రకటించాలని రాహుల్ గాంధీని కోరినట్లు తెలిపారు. సీనియర్లు అందరూ కలిస్తే 40 నుంచి 50 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అయితే, అధికారమే లక్ష్యంగా నాయకులతో సహా కార్యకర్తలంతా మూకుమ్మడిగా కలిసి పనిచేస్తున్న తరుణంలో వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్ సొంత పార్టీ నేతలను కోపానికి గురిచేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి కార్యకర్తల్లో జోష్ పెంచాల్సింది పోయి.. అధికారంలోకి రాదని తేల్చి చెప్పడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై ఎంపీ కోమటిరెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.