తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. త్వరలోనే రెండు లక్షల రుణమాఫీ(Rythu Runa Mafi) చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలిచేందుకే కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ప్రకటించిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి గురించి పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క త్వరలో రుణమాఫీ చేస్తామని, దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ నడుస్తోందని వెల్లడించారు. అయితే, రుణమాఫీతో పాటు రైతులకు మరో తీపి కబురు చెప్పేందుకు తెలంగాణ సర్కార్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
ఒకేసారి రూ. రెండు లక్షల రైతు రుణమాఫీ(Rythu Runa Mafi) చేసిన తర్వాత.. రైతులకు ఇచ్చే రుణ పరిమితిని పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రూ.3 లక్షల రైతు రుణాలు ఇచ్చేందుకు విధివిధానాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. రైతుల రుణ చరిత్ర ఆధారంగా రూ. 3 లక్షల వరకూ వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోనున్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటివరకు రైతులు చెల్లిస్తున్న పావలా వడ్డీని సైతం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ.. వారికి వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు రూపకల్పన చేస్తున్నట్టు సమాచారం.