ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) మంగళవారం నాగర్‌కర్నూలు జిల్లాలో పర్యటించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ.52 కోట్లతో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవనాన్ని, బీఆర్ఎస్ భవనాన్ని, జిల్లా పోలీసు కార్యాలయాన్ని ఈ సందర్భంగా సీఎం(CM KCR) ప్రారంభించారు. అనంతరం ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లలో తెలంగాణ ఎన్నో విజయాలు సాధించిందని తెలిపారు. అనేక రంగాల్లో దేశంలో అగ్రభాగాన నిలిచిందని తెలిపారు. గతంలో వలసలతో కన్నీరు పెట్టిన పాలమూరు జిల్లా.. నేడు పచ్చని పంటలతో కళకళలాడుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఒక్క కల్వకుర్తి నియోజకవర్గంలోనే లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని వెల్లడించారు. నేడు పాలమూరు జిల్లాలో అద్భుతాలు జరుగుతున్నాయని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణ(Telangana) అభివృద్ధి చాలా బెటర్‌గా ఉందని వెల్లడించారు. అందరం కలిసిగట్టుగా పనిచేస్తేనే ఈ అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు. దేశంలో వస్తున్న ఐటీ ఉద్యోగాల్లో 50 శాతం హైదరాబాద్ నుంచే వస్తున్నాయని అన్నారు.