తెలంగాణ పదో తరగతి ఫలితాలు(TS SSC Results) విడుదలయ్యాయి. బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 91.31 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 మధ్య జరిగిన ఈ పరీక్షలకు సుమారు 5లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. 19 కేంద్రాల్లో 9 రోజుల పాటు స్పాట్ వాల్యూయేషన్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
TS SSC Results | ఫలితాల్లో బాలికలు 93.23 ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. 8,883 మంది విద్యార్థులు 10కి 10 GPA సాధించడం విశేషం. నిర్మల్ జిల్లా. 99.05శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా.. వికారాబాద్ జిల్లా 91.31 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. 3,927 స్కూల్స్‌లో 100 శాతం ఉత్తీర్ణత సాధించగా.. 6 ప్రైవేటు పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాలను bse.telangana.gov.inలో చెక్ చేసుకోవచ్చు. మరోవైపు ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం జూన్ 3 నుంచి 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.