ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చి హాట్రిక్ సాధించాలని కసితో ఉన్నారు. ఈ క్రమంలోనే అన్ని వర్గాల ఓట్లను కీలకంగా తీసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీలు సైతం దూకుడు పెంచడంతో ఒక్క ఓటు కూడా మిస్సవ్వకుండా సీఎం వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీని(TSRTC) ప్రభుత్వంలో విలీనం చేయడం, రుణమాఫీపై ప్రకటన చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇదిలా ఉండగా.. ఆర్టీసీ(TSRTC) ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగుల సౌకర్యార్థం గాజులరామారం నుంచి వేవ్ రాక్‌కు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రత్యేక బస్సు ఉదయం 8.40 గంటలకు గాజులరామారం నుంచి బయలుదేరి.. మహాదేవ్ పురం, ఎన్టీఆర్ గార్డెన్, ఎల్లమ్మ బండ, కేపీహెచ్‌బీ, జేఎన్‌టీయూ, హైటెక్ సిటీ, మైండ్ స్పేస్, బయో డైవర్శిటీ, గచ్చిబౌలి క్రాస్ రోడ్, విప్రో జంక్షన్ మీదుగా వేవ్ రాక్‌కి వెళ్తుంది. ఈ సదుపాయాన్ని ఐటీ ఉద్యోగులు వినియోగించుకుని.. సంస్థను ఆదరించాలని ఇవాళ సంస్థ ఎండీ సజ్జానార్ తెలిపారు.