తెలంగాణ ఆర్టీసీ(TSRTC) ఎండీ సజ్జనార్(Sajjanar) అద్దె బస్సు యజమానులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. అద్దె బస్సు ఓనర్లు తమ దృష్టికి తెచ్చిన సమస్యలపై వారం రోజుల్లో ఓ కమిటీ వేస్తామని ఈ సందర్భంగా సజ్జనార్ తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి అద్దె బస్సులు యథావిధిగా నడుస్తాయని స్పష్టంచేశారు. సంక్రాంతికి కూడా ఉచిత బస్సు సర్వీసులు ఉంటాయని.. స్పెషల్ బస్సులు నడుపుతామని ఆయన పేర్కొన్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా 2,700 అద్దె బస్సులు నడుస్తున్నాయి.
TSRTC | మరోవైపు సంక్రాంతి(Sankranti) పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి 4,484 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఈనెల 6 నుంచి 15 వరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. కేవలం ఏపీకి 1,450 స్పెషల్ సర్వీసులు నడపనున్నట్లు వెల్లడించారు. కాగా మహిళల ఉచిత ప్రయాణంతో బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరుగుతుందని.. బస్సులు పాడవుతున్నాయనే కారణంతో ఈనెల 5 నుంచి అద్దె బస్సుల ఓనర్స్ సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.