అసెంబ్లీలో జర్నలిస్టులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఎవరు పడితే వాళ్ళు ట్యూబ్ పట్టుకుని ఇష్టమొచ్చినట్టు పిచ్చి రాతలు రాస్తే బట్టలూడదీసి రోడ్డుపై నిలబెడతాం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలని పలువురు జర్నలిస్టులు తప్పుబడుతున్నారు. జర్నలిస్టులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే ఉద్యమానికి సిద్దమవుతామని తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల వేదిక (TUJV) హెచ్చరించింది.
మీమీ రాజకీయాలను మొత్తం జర్నలిజానికి ఆపాదించాలనుకోవడం ఆక్షేపణీయం అని TUJV పేర్కొంది. స్పీకర్ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఇప్పటికే రికార్డుల నుంచి తొలగించి ఉండాల్సింది.. ఇప్పటికైనా తొలగించాలి అని డిమాండ్ చేసింది. తెలంగాణ జర్నలిస్టులు కడుపు మాడ్చుకొని ఉద్యమానికి ఊపిరిపోస్తేనే రేవంత్ రెడ్డి కూడా సీఎం అయ్యారనే విషయాన్ని మర్చిపోకూడదని సూచించింది. సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) జర్నలిస్టులకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పి గౌరవాన్ని నిలబెట్టుకోవాలని కోరింది. లేదంటే తదుపరి ఉద్యమ కార్యాచరణను తీసుకుంటామని తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల వేదిక (TUJV) హెచ్చరికలు జారీ చేసింది.