తెలంగాణలో ఎన్నికల హడావిడి జోరందుకుంది. అన్ని పార్టీల్లోనూ టికెట్ల కేటాయింపు వ్యవహారం చిక్కుముడిగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానం 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి అందరినీ విస్మయానికి గురి చేసిన విషయం తెలిసిందే. అభ్యర్థుల జాబితా విడుదలైన నాటి నుండి కారు పార్టీలో అగ్గిరాజుకుంది. ఈసారి కూడా సిట్టింగులకే టికెట్లు కేటాయించి ఆశావాహులను నిరాశపరిచారు కేసీఆర్. భంగపాటుకు గురైన అభ్యర్థులు అసంతృప్తితో రగిలిపోతున్నారు.
హై కమాండ్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడింది బీఆర్ఎస్ అధిష్టానం. ఒక నియోజకవర్గానికి ఇద్దరు నుండి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడటంతో.. గులాబీ పార్టీలో ఈ పరిస్థితి నెలకొంది. అయితే, ఇలాంటి పరిస్థితులు కేవలం అధికార పార్టీలోనే కాదు.. విపక్ష పార్టీల్లోనూ తలనొప్పిగా మారింది. బిజెపి, కాంగ్రెస్ లో సైతం టికెట్ల కేటాయింపులో తర్జనభర్జన పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈటల శిష్యురాలు తుల ఉమకు వేములవాడ టికెట్ విషయంలో భంగపాటు తప్పదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ బీజేపీ ఎమ్మెల్యే టికెట్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ టికెట్ కోసం ప్రయత్నం చేసుకుంటున్న కరీంనగర్ ఉమ్మడి జిల్లా జెడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ(Tula Uma), రాష్ట్ర నాయకులు ఎర్రం మహేశ్ లకు భంగపాటు తప్పేలా లేదని చర్చలు సాగుతున్నాయి. బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు చెన్నమనేని వికాస్ రావు ఉన్నట్లుండి బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ ని కలిసిన ఫొటోలు వైరల్ కావడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. దీంతో వేములవాడ బీజేపీలో ఒక్కసారిగా అసంతృప్తి జ్వాలలు రగులుకుంటున్నాయి.
ఇప్పటి వరకు సామాజిక సేవా కార్యక్రమాలకు మాత్రమే పరిమితమైన చెన్నమనేని వికాస్ రావు(Chennamaneni Vikas Rao), ఏ పార్టీలో చేరుతాడో అనే సందేహం స్థానిక రాజకీయ వర్గాల్లో ఉండేది. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబుకు టికెట్ మిస్సయితే.. అవకాశం వస్తే బీఆర్ఎస్ లో చేరతారని ప్రచారం కొనసాగింది. అయితే, సీఎం కేసీఆర్ వేములవాడ టికెట్ ను చల్మెడ లక్ష్మీనరసింహారావుకు కేటాయించడం, అసంతృప్తికి లోనైన చెన్నమనేని రమేశ్ బాబు జర్మనీ నుంచి నేరుగా హైదరాబాద్ లోని ప్రగతి భవన్ కు వెళ్లడం, అదే రోజు చెన్నమనేని వికాస్ రావు బండి సంజయ్ ని కలవడం అంతా ప్లాన్ ప్రకారం జరిగినట్లు తెలుస్తోంది.
వికాస్ బీజేపీలో చేరి టికెట్ సాధిస్తే.. చెన్నమనేని రమేశ్ బాబు పార్టీ వీడి వికాస్ రావుకు ఎక్కడ సపోర్టు చేస్తారో అని భయపడిన గులాబీ అధిష్టానం.. ఆయనకి రాష్ట్రస్థాయి పదవి ఆఘమేఘాల మీద ప్రకటించినట్లు రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. కాగా, వికాస్ రాకతో వేములవాడ బీజేపీలో అగ్గి రాజుకుంటోంది. టికెట్ తీసుకుపోతాడేమో ఆందోళనతో వేములవాడ నాయకులు బండి సంజయ్ ను కలిసేందుకు సిద్ధమయ్యారు.
తాము కీలక సమయంలో బండి సంజయ్(Bandi Sanjay) ను నమ్ముకొని పార్టీలో చేరామని, ఇప్పుడు ఉన్నట్లుండి వికాస్ రావు వస్తే ఆయనకు ఏం హామీ ఇస్తారని అడిగేందుకు రెడీ అవుతున్నారు. బీజేపీ టికెట్ బీసీలకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అధిష్టానం తమకే టికెట్ కేటాయిస్తుందని ఇటు తుల ఉమ(Tula Uma), అటు ఎర్రం మహేశ్ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అవకాశం వస్తే తాను కూడా పోటీలో ఉంటానని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆశ పడుతున్నారు. ఏది ఏమైనా చెన్నమనేని వికాస్ రావు రాకతో వేములవాడ బీజేపీలో రాజకీయ రగడ మొదలైంది.