కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి మాంచి జోష్‌లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌లో మరో కొత్త పంచాయతీ తెరమీదకు వచ్చింది. వార్ రూమ్ కేసు వ్యవహారంపై మాజీ పీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలపై వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారం తన వరకే పరిమితం కాలేదని పలువురు కాంగ్రెస్ సీనియర్లపై కూడా ప్రశాంత్ పోస్టులు పెట్టాడని ఆరోపించారు. మా క్యారెక్టర్‌ను నాశనం చేసేలా వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాల్లో పోస్టింగులు పెట్టిస్తున్నారని దీని వెనుక కాంగ్రెస్ ముఖ్య నేతలే ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి దుష్ప్రచారం చేయిస్తున్నారని ఉత్తమ్(Uttam Kumar Reddy) మండిపడ్డారు. దీని వెనుక ఉన్నది ఎవరు, ఇదంతా ఎవరు చేయిస్తున్నారో రెండు రోజుల్లో అన్ని విషయాలు వెల్లడిస్తానన్నారు.