తాను కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై నల్గొండ ఎంపీ, మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) మారోసారి సీరియస్ అయ్యారు. తనపై గడిచిన రెండేళ్లుగా వ్యూహాత్మకంగా దాడి జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రచారం వెనుక ఇంటి దొంగల హస్తం ఉందని.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత వెనుకుండి ఇదంతా చేయిస్తున్నారని ఆరోపించారు. కావాలనే తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు.
కాంగ్రెస్ పార్టీలో నా అనుచరులను అణగదొక్కడానికే తన పై తప్పుడు ప్రచారం వైరల్ చేస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీఆర్ఎస్(BRS) లో చేరబోతున్నారని పార్లమెంట్ సమావేశాలు ముగియగానే ఈ తంతు జరుగుతుందని సోషల్ మీడియాలో మరోసారి జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికల వేళ ఈ ప్రచారం ఉత్తమ్ కు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఉత్తమ్ శనివారం ఘాటుగా రియాక్ట్ అయ్యారు.