తెలంగాణ ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవీలత(Madhavi Latha)కు సెక్యూరిటీ పెంచింది. ఆమెకు ఏకంగా వై ప్లస్ భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వీఐపీ సెక్యూరిటీలో భాగంగా 11 మందికి పైగా CRPF భద్రతా సిబ్బంది ఆమె వెంట ఉండనున్నారు. ఎంఐఎం కంచుకోట హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి మాధవీలత బరిలోకి దిగుతున్నారు. ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. దశాబ్దాలుగా అక్కడి నుంచి ఎంఐఎం అభ్యర్థులు అక్కడ ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు.
దీంతో హైదరాబాద్ ఎంపీ స్థానం గెలుచుకుని కాషాయం జెండా ఎగరేయాలని బీజేపీ పెద్దలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వ్యూహాత్మకంగా హిందూ ధర్మం పట్ల ప్రచారం నిర్వహిస్తున్న విరంచి హాస్పిల్స్ చైర్ పర్సన్ మాధవీలత(Madhavi Latha)ను ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. అయితే కీలకమైన స్థానం కావడంతో ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందనే సమాచారంతో ఆమెకు వై ప్లస్ భద్రత ఏర్పాటుచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆరుగురు సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఆమె వెంట ఉండగా.. మరో ఐదుగురు భద్రతా సిబ్బంది ఇంటి వద్ద సెక్యూరిటీగా ఉంటారు.