వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల(YS Sharmila) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని అందుకే తమ మద్దతు తెలియజేస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీల్చి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టంచేశారు. దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని షర్మిల పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ను ఓడించేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు.
పాలేరు(Paleru)లో కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivas Reddy) బరిలో ఉన్నారని.. 2014 ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం తాను ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో తన పాదయాత్ర సమయంలో పొంగులేటి మద్దతుగా నిలిచారని తెలిపారు. అందుకే పొంగులేటిని ఓడించడం ఇష్టంలేక తాను కూడా పోటీకి దూరంగా ఉన్నానన్నారు. దయచేసి తమ నిర్ణయాన్ని పార్టీ శ్రేణులందరూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్టీపీ కార్యకర్తలు, నేతలు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేయాలని షర్మిల పిలుపునిచ్చారు. దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి బిడ్డగా తెలంగాణ భవిష్యత్ కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని.. ప్రజలు తనను క్షమించాలని షర్మిల(YS Sharmila) కోరారు.