ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy)కి వైసీటీపీ అధినేత్రి వైఎస్ షర్మిల(YS Sharmila) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రెండేళ్ల క్రితం తెలంగాణలో తాను పార్టీ పెట్టినప్పుడు తమతో సంబంధం లేదని సజ్జల అన్నారని.. మరి ఇప్పుడు ఏ సంబంధం ఉందని ఆయన తన గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తమతో సంబంధం మళ్లీ కోరుకుంటున్నారా.. దీనిపై సజ్జల సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సింగిల్ రోడ్డు ఉంటే ఏపీ.. డబుల్ రోడ్డు ఉంటే తెలంగాణ.. చీకట్లు ఉంటే ఏపీ.. వెలుగులు ఉంటే తెలంగాణ.. అని సీఎం కేసీఆర్ బహిరంగంగా విమర్శిస్తున్నారని.. ఈ వ్యాఖ్యలపై సజ్జల ఏం సమాధానం చెబుతారు? సజ్జల.. ముందు మీ కథ మీరు చూసుకోండి అని షర్మిల ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా విలేకరులు సజ్జల మాట్లాడారంటే దాదాపు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడినట్లే అని ప్రశ్నించగా.. ఎవరైనా సరే తన సమాధానం ఇదేనని ఆమె స్పష్టం చేశారు.
కాగా అంతకుముందు తెలంగాణ ఎన్నికల్లో పోటీకి షర్మిల(YS Sharmila) పార్టీ దూరం కావడంపై సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జగన్మోహన్రెడ్డిని ఏ పార్టీ అయితే వేధించి అక్రమ కేసులు పెట్టిందో ఆ పార్టీతో షర్మిల కలవడాన్ని ఆమె ఇష్టానికే వదిలేస్తున్నామని తెలిపారు. ఈ వ్యాఖ్యలపైనే షర్మిల ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు.