కరోనా దెబ్బకు పిట్టల్లా రాలుతున్న సెర్ప్ ఉద్యోగులు

0
125

కరోనా దెబ్బకు పిట్టల్లా రాలుతున్న సెర్ప్ ఉద్యోగులు

కరోనా రెండవ దశలోనూ వరి ధాన్యం కొనుగోలు, బ్యాంకు రుణాల పంపిణీ వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న సెర్ప్ సిబ్బంది.

మరణించిన SERP సిబ్బందికి కారుణ్య నియామకాలు వర్తింపు కోసం ఎదురుచూపులు.

చికిత్స కాలానికి సెలవులు దక్కని వైనం.

మరణించిన SERP ఉద్యోగికి ఒక్కపైసా చెల్లించని ప్రభుత్వం.

సొంతంగా చేసుకున్న ఇన్సూరెన్స్ మాత్రమే గతి.

కనీస జాలి లేకుండా కారోనాతో హాస్పిటల్ లో ఉన్న సిబ్బంది వేతనాలు కట్ చేస్తున్న SERP అధికారులు.

గత 20 సంవత్సరాలుగా 51 లక్షల గ్రామీణ మహిళల సంక్షేమం కోసం అహర్నిశలు SERP సిబ్బంది కృషి చేస్తున్నారు.
SERP సంస్థ లో యాభై లక్షల మహిళలు, 5 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాలు, 20 వేల గ్రామ సమాఖ్యలు,
586 మండల సమాఖ్యలు, 32 జిల్లా సమాఖ్యలతో గిన్నిస్ రికార్డు స్థాయిలో ప్రపంచ స్థాయి సంస్థగా ఎదగడంలో సిబ్బంది పాత్ర చాలా కీలకమైంది.

ఇంతటి ప్రాధాన్యత ఉన్న సంస్థకు సాక్షాత్తు ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉండడం విశేషం.

SERP ఉద్యోగుల ప్రత్యేకతను గుర్తించి గత ఎన్నికల్లో కెసిఆర్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఏకంగా మేనిఫెస్టో లో సైతం చేర్చారు.

ప్రస్తుతం కరోనా మహమ్మారి రెండవదశ గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా వ్యాపించిన నేపథ్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మహిళా సంఘాలకు రుణాలు ఇప్పించడం, నూతన వ్యాపారాలు ఏర్పాటు, పలు సర్వేలలో భాగస్వామ్యం కావడం వంటి ఎన్నో కీలక పనులను SERP సిబ్బంది చేస్తున్నారు.

విధినిర్వహణలో అందరికీ జాగ్రత్తలు చెబుతున్న SERP సిబ్బంది అనుకోకుండానే కరోనా బారిన పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 600 మందికి పైగా కరోన పాజిటివ్ వచ్చి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు, పలువురు హోం ఐసోలేషన్ లో ఉన్నారని యూనియన్ నాయకులు కుంట గంగారెడ్డి, ఎపూరి నర్సయ్య లు వెల్లడించారు.

గత వారం రోజుల వ్యవధిలో ఇద్దరు సిబ్బంది మరణించగా తాజాగా శనివారం నల్గొండ జిల్లాకు చెందిన సీసీ గాదె శేఖర్ కరోనాతో అకాల మరణం చెందినట్లు సెల్ఫ్ యూనియన్ నాయకులు వెల్లడించారు. ఒకపక్క SERP సిబ్బంది పిట్టల్లా రాలుతుంటే అధికారులు మాత్రం మీనమేషాలు లెక్కిస్తూ కారుణ్య నియామకం విషయాన్ని ఎటూ తేల్చ లేదు అని SERP ఉద్యోగులు వాపోతున్నారు.

పలుమార్లు లేఖలు రాసినా అధికారులకు పదేపదే విన్నవించుకున్నా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో శాఖ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, SERP సంస్థ చైర్మన్ అయినటువంటి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక చొరవ చూపి వెంటనే సిబ్బందికి కారుణ్య నియామకాలు వర్తింపజేయాలని, అదేవిధంగా చికిత్స పొందుతున్న సిబ్బందికి మెడికల్ లీవ్ ఇవ్వాలని, అకాల మరణం చెందిన సెర్ప్ సిబ్బంది కి 25 లక్షల నష్టపరిహారం మంజూరు చేయాలని యూనియన్ నాయకులు కుంట గంగారెడ్డి, నర్సయ్య, సుభాష్ గౌడ్, మహేందర్ రెడ్డి లు విజ్ఞప్తి చేశారు.