తెగతెంపులు : స్పీకర్ ఫార్మాట్ లో ఈటల రాజీనామా

0
37

టిఆర్ఎస్ పార్టీతో 20 ఏళ్లుగా ఉన్న అనుబంధాన్ని ఈటల రాజేందర్ తెగతెంపులు చేసుకున్నారు. తనకు ఉన్న తోక లంకె కూడా ఇవాళ తెగిపోయింది. స్పీకర్ ఫార్మాట్ లో శాసనసభ సెకట్రరీకి తన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామా లేఖను సమర్పించారు. అతి త్వరలో ఈటల రాజీనామా ఆమోదం పొందే అవకాశాలున్నాయి. ఇక ఈటల అధికారికంగా మరో రెండు మూడు రోజుల్లో బిజెపిలో చేరడం ఆ తర్వాత హుజూరాబాద్ లో ఉప సమరంలోకి దూకడమే మిగిలి ఉన్నాయి.

ఈటల శనివారం ఉదయం తన నివాసం నుంచి బయలుదేరి నేరుగా తెలంగాణ అమరవీరుల స్థూపం గన్ పార్క్ చేరుకున్నారు. అక్కడ నివాళులు అర్పించి అక్కడినుంచి అసెంబ్లీలోకి వెళ్లి అసెంబ్లీ సెక్రటరీకి ఏకవ్యాఖ్య రాజీనామా లేఖ ఇచ్చారు.

అసెంబ్లీకి వెళ్లే ముందు గన్ పార్కు వద్ద ఈటల మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఓటమి లేకుండా ప్రజలు ఆశీర్వదించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రమే ప్రజలకు శ్రీరామరక్ష అని కొట్లాడామని గుర్తు చేసుకున్నారు. అనేక మంది వేరే పార్టీ వాళ్లు రాజీనామా చేయకుండా నిస్సిగ్గుగా మంత్రులుగా కొనసాగుతున్నారని విమర్శలు గుప్పించారు.

వందల కోట్ల రూపాయలు కేసిఆర్ దగ్గర ఉన్నాయి ఓడగొడతారు… రాజీనామా చేయవద్దు అని చాలామంది తనకు చెప్పారని గుర్తు చేసుకున్నారు. హుజూరాబాద్ ఎన్నిక యావత్ తెలంగాణ ప్రజలకు కేసిఆర్ కుటుంబానికి మధ్య జరిగే ఎన్నికలు కాబోతున్నాయని చెప్పారు. హుజూరాబాద్ ప్రజలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుటా ఎగురవేస్తారని ధీమా వ్యక్తం చేశారు. యావత్ తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసమే రాజీనామా చేస్తున్నాని ప్రకటించారు.

తెలంగాణలో వడ్లు తడిచి మొలకలెత్తినా పట్టించుకునే నాథుడే లేడన్నారు. యువత ఉపాధి లేకపోయినా పట్టించుకోరని విమర్శించారు. కానీ ఈటలను ఎలా ఛక్రబంధంలో ఇరికించాలని మాత్రం ఆలోచిస్తూ అధికారులను, పోలీసులను వాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ సమాజానికి ఇవాళేమీ నిర్బంధాలు కొత్త కాదని, వాటిని ప్రజలు, నాయకులు తొక్కి పడేస్తారని హెచ్చరించారు.

నియంత నుంచి తెలంగాణను విముక్తి చేయడమే నా ఎజెండా అని అమరవీరుల స్థూపం సాక్షిగా ప్రకటించారు. మేధావులు అంతా ఆలోచన చేయాలని, తాను ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో అర్థం చేసుకోవాలని కోరారు. చైతన్యం చంపివేయబడిందని, తెలంగాణలో ప్రజాస్వామిక విధానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ హుజూరాబాద్ రావాలని, అక్కడి ప్రరజలకు అండగా ఉండాలని విన్నవించారు.

అమెరికా వారు కూడా నన్ను గెలిపించాలని కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ స్వరాష్ట్రంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు సైతం కనీస గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ వారి ఆశయాల కోసం పోరాటం చేయడానికి ముందుకు సాగుతున్నానని వివరించారు.