వన్డే, టీ20 కెప్టెన్ గా​ రోహిత్​శర్మ ఖాయమేనా?..రేసులో వారు కూడా..

Is Rohit Sharma safe as ODI and T20 captain? They are also in the race.

0
35

టీ20 ప్రపంచకప్​ తర్వాత కోహ్లీ టీ20 కెప్టెన్సీకి గుడ్​బై చెప్పనున్నాడు. అయితే విరాట్​ తర్వాత ఆ బాధ్యతలు చేపట్టే అవకాశాలు రోహిత్​కే ఎక్కువగా ఉన్నాయని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. దీంతో పాటే వన్డేలకు కూడా అతడిని కెప్టెన్ చేయాలని బీసీసీఐ భావిస్తోందని తెలిసింది.​ త్వరలో జరగబోయే సెలక్టర్ల సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనుందట.

అయితే బీసీసీఐ పరిశీలనలో కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌ పేర్లు ఉన్నట్లు ప్రముఖంగా వినిపిస్తోంది. ఒకవేళ టీ20, వన్డే కెప్టెన్సీ అయితే సీనియారిటీకి ప్రాముఖ్యత ఇచ్చి..రోహిత్‌కే పట్టం కట్టొచ్చు. మరోవైపు కొత్త కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కూడా రోహిత్‌కి కెప్టెన్సీ అప్పగించడంపై సుముఖంగా ఉన్నాడని టాక్‌.

పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఓ కారణం ఉందట. రాబోయే రెండేళ్లలో రెండు ఐసీసీ ఈవెంట్లు జరగనున్నాయి. 2022లో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. 2023లో మన దేశంలో వన్డే ప్రపంచకప్‌ జరుగుతుంది. ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని కెప్టెన్‌ను ఎంపిక చేస్తున్నారట.

ఇప్పటి నుంచి జట్టు కూర్పును పక్కా చేసుకుంటేనే ఆ ఈవెంట్లలో మన జట్టు నుంచి మంచి ఫలితం ఆశించొచ్చు. విరాట్‌ నేతృత్వంలో ఐసీసీ ఈవెంట్లలో భారత ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం. భారత కెప్టెన్‌ ఎంపిక విషయంలో బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. త్వరలో జరగబోయే సెలక్టర్ల సమావేశంలో దీనిపై పూర్తి స్పష్టత వస్తుంది.