కేసిఆర్ సారూ.. జర మమ్మల్ని కూడా సూడూ…

0
99
serp jac gangadhar with cm kcr (File)

తెలంగాణలో ఉద్యోగాల విషయంలో సర్కారు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో సెర్ప్ ఉద్యోగుల జెఎసి నేతలు సిఎం కేసిఆర్ కు బహిరంగ లేఖ రాశారు. వారు రాసిన లేఖను యదాతదంగా దిగువన ప్రచురిస్తున్నాం.

గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు,

ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్రం, దివ్య సుముఖమునకు,

ఆర్యా,

విషయం: TRS ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం & ప్రస్తుత అసెంబ్లీ ఉభయసభల తొలి సమావేశంలో గవర్నర్  ప్రసంగంలో ప్రస్తావించిన ప్రకారం ఐకేపీ (SERP) 4156 మంది ఉద్యోగులను ప్రస్తుతం ప్రకటించిన 50,000 పోస్టులలో చేర్చి రెగ్యులరైజ్ చెయ్యాలనే విషయం గురించి..

పై విషయమై తమరి దివ్య సముఖమునకు చేయు మనవి ఏమనగా, ఇరవై ఒక్క సంవత్సరాలు గా 50 లక్షల గ్రామీణ పేద నిరుపేద మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వ మార్గనిర్దేశకత్వం లో పనిచేస్తున్న ఐకెపి (SERP) సిబ్బంది ని రెగ్యులరైజ్ చేస్తామని గత ఎన్నికల సందర్భంగా పార్టీ అధ్యక్షుని హోదాలో గౌరవనీయులైన తమరు టిఆర్ఎస్ మేనిఫెస్టో లో ఐకేపీ ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రత్యేకంగా పొందుపరచి ఉన్నందున మరియు దీనికి కొనసాగింపుగా ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ తొలి సమావేశం సందర్భంగా ఉభయ సభల సమావేశంలో ప్రభుత్వం తరఫున చేసే గవర్నర్ గారి ప్రసంగంలో ఐకెపి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రత్యేకంగా ప్రస్తావించి హామీ ఇచ్చినందుకు సదా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

serp logo

తమరు ఇచ్చిన భరోసాతో, రెట్టించిన ఉత్సాహం పొంది గత ఆర్థిక సంవత్సరంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పదివేల కోట్ల రూపాయల రుణాలను 50 లక్షల కుటుంబాలకు తమరి మార్గ నిర్దేశకత్వంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ ఏడాది 12 వేల కోట్ల రూపాయల రుణాలను పంపిణీ చేసేందుకు సిబ్బంది అంతా అహోరాత్రులు కృషి చేస్తున్నారు. మరోపక్క వరి ధాన్యం కొనుగోలులో తమరు జాతీయస్థాయి రికార్డు సాధనలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా మా వంతు పాత్ర పోషించిన సంగతి కూడా తమకు విదితమే.

ఇదిలా ఉండగా తమరు తాజాగా 50 వేల పోస్టులను ప్రభుత్వ శాఖలలో భర్తీ చేయనున్నట్లు ప్రకటించి ఉన్నారు. ఇందులో భాగంగానే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తమరే స్వయానా చైర్మన్ గా ఉన్న SERP సంస్థ పరిధిలోనీ 4156 మంది ఐకెపి SERP ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తు, మా 4156 SERP సిబ్బంది పోస్టులను 50 వేల పోస్టుల లో చేర్చి రెగ్యులరైజ్ చేయాలని రాష్ట్రంలోని SERP ఉద్యోగుల అందరి తరపున తమ పాదపద్మములకు నమస్కరిస్తూ విన్నవించుకుంటున్నాము.  ఈ మేరకు స్టేట్ యూనియన్స్ ప్రతినిధులు మరియు జిల్లా యూనియన్స్ ప్రతినిధులతో లతో కలిపి ప్రగతి భవన్ లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశాన్ని ప్రకటించుటకు సహృదయంతో పరిశీలించి ప్రకటన చేయాలని విన్నవించుకుంటున్నాము.

ధన్యవాదాలతో…

గంగాధర్ రెడ్డి

నర్సయ్య

సుభాష్

మహేందర్ రెడ్డి

SERP ఉద్యోగ సంఘాల జేఏసీ.