స్పెషల్ డ్రైవ్ : పదిరోజుల్లోగా తెలంగాణ వలస కార్మికుల డేటా

0
39

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, రాష్ట్రంలో పనిచేస్తున్న వలస కార్మికుల సంక్షేమంపై రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖామాత్యులు మల్లారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శనివారం కార్మిక శాఖ అధికారులతో బి.ఆర్‌.కె.ఆర్ భవన్‌లో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో వలస కార్మికులకు రేషన్ కార్డులు, ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి ప్రయోజనాలను అందించడానికి గాను ఒక విధానాన్ని రూపొందించడానికి ఫార్మాస్యూటికల్, టెక్స్ టైల్స్, రైస్ మిల్స్, కన్ స్ట్రక్షన్ వంటి అన్ని పరిశ్రమల నుండి డేటాను సేకరించడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని శాఖ అధికారులను ఆదేశించారు.

వలస కార్మికుల సంక్షేమ కార్యక్రమాల అమలుకు నోడల్ అధికారిని నియమించుకొని సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని, ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 10 రోజుల్లోగా వలస కార్మికుల డేటాను సేకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, కార్మిక శాఖ కార్యదర్శి అహ్మద్ నదీమ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.