ఎల్లో సముద్ర జలాల్లో చైనాకు చెందిన ఓ అణు జలాంతర్గామి(Nuclear Submarine) ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సబ్ మెరైన్ లోని 55 మంది నావికులు దుర్మరణం చెందారు. అమెరికా, దాని మిత్రపక్షాలకు చెందిన సబ్మెరైన్లు తమ క్వింగ్గావ్ నౌకాదళ స్థావరం ప్రాంతంలోకి ప్రవేశించకుండా సముద్రం అడుగున చైనా గొలుసుల ఉచ్చు నిర్మించింది. అయితే ఆ ఉచ్చులోనే చైనా జలాంతర్గామి చిక్కుకుని ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ప్రమాదంపై బ్రిటన్ కు చెందిన పలు వార్తా సంస్థలు కొన్ని కథనాలను ప్రచురించాయి. చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్ లోని ఎల్లో సముద్రంలో ఆగస్టు 21న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీకి చెందిన 350 అడుగుల అణుశక్తి సబ్మెరైన్ ‘1093-417’ సముద్రంలో ఉచ్చుకు చిక్కుకుపోయింది. దీంతో ఆ జలాంతర్గామిలో బ్యాటరీల శక్తి అయిపోయింది.
ఫలితంగా అందులో ఉన్న వాయు శుద్ధీకరణ, వాయు నిర్వహణ వ్యవస్థలు పనిచేయడం ఆగిపోయి ఉండొచ్చని, దీంతో ప్రత్యామ్నాయ వ్యవస్థకు మార్చి ఉండొచ్చని బ్రిటన్ నిపుణులు పేర్కంటున్నారు. కానీ, అది కూడా విఫలం కావడంతో గాలి కలుషితమై హైపాక్సియా అనే పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రమాదంలో సబ్మెరైన్(Nuclear Submarine) కెప్టెన్ కర్నల్ షూ యాంగ్ పెంగ్ సహా 22 మంది అధికారులు, ఏడుగురు ఆఫీసర్ కేడెట్లు, 9 మంది పెట్టి అధికారులు, 17 మంది నావికులు కలిసి మొత్తం 55 మంది సబ్ మెరైనర్ల ప్రాణాలు పోయాయి. ఆ జలాంతర్గామికి మరమ్మతులు చేసి సముద్రం అడుగు నుంచి పైకి తీసుకురావడానికి ఆరు గంటల సమయం పట్టింది. ఉచ్చులో చిక్కుకుపోయిన సబ్మెరైన్ విషయంలో అంతర్జాతీయ సహకారాన్ని చైనా నిరాకరించింది. ఆగస్టులోనే ఈ ప్రమాదం జరిగినా.. ఆ దేశం ఇప్పటి వరకు నోరు మెదపలేదు అంటూ బ్రిటన్ ఇంటెలిజెన్స్ వర్గాల(Britain Intelligence Agencies) రిపోర్టుల ఆధారంగా మీడియా పేర్కొంది.