పాకిస్థాన్(Pakistan) లో శుక్రవారం ఘోర ఆత్మాహుతి దాడి జరిగింది. బలూచిస్థాన్ ప్రావిన్సులో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఓ మసీదు ప్రాంగణంలో జరిగిన ఈ దాడిలో కనీసం 58 మంది మరణించగా.. 100 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఓ డీఎస్పీ కూడా ఉన్నారు. మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకుని ర్యాలీ జరిపేందుకు మస్తుంగ్ జిల్లా మదీనా మసీదు వద్దకు స్థానికులు తరలివచ్చారు. అదే తరుణంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దుర్ఘటనలో ర్యాలీ పర్యవేక్షణ విధుల్లో ఉన్న డీఎస్పీ నవాజ్ గష్కోరి కూడా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆత్మాహుతికి పాల్పడిన వ్యక్తి డీఎస్పీ కారు పక్కనే నిలబడి తనను తాను పేల్చుకొన్నట్లు వెల్లడించారు.
Pakistan | మస్తుంగ్ జిల్లాలో దాడి జరిగిన కొంత వ్యవధి లోనే ఖైబర్ పున్భ్వా ప్రావిన్సులోని హంగు నగర మసీదులో మరో ఆత్మాహుతి దాడి జరగడం గమనార్హం. అందరూ శుక్రవారం ప్రార్థనల్లో ఉండగా జరిగిన పేలుడుతో నలుగురు వ్యక్తులు మరణించగా, 12 మంది గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. మసీదుకు పక్కనే ఉన్న దావోబా ఠాణాలోకి అయిదుగురు ఉగ్రవాదులు ప్రవేశించారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై కాల్పులు జరపగా.. వారిలో ఒక వ్యక్తి మసీదు వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు.