అవకాశం దొరికినప్పుడల్లా భారత్ పై విషం చిమ్ముతోంది కెనడా(Canada). నిజ్జర్ హత్య కేసులో భారత్ హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి. తాజాగా మరోసారి భారత్ పై కెనడా సంచలన ఆరోపణలు చేసింది. భారత్ ను తమ ఎన్నికల్లో జోక్యం చేసుకునే విదేశీముప్పుగా భావిస్తూ కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీసు రిపోర్టు తయారు చేసింది. కెనడా ప్రజాస్వామ్యం, విలువలు, సార్వభౌమత్వాన్ని విదేశీశక్తులు బలహీనపరచే అవకాశాలున్నట్లు సదరు రిపోర్టులో పేర్కొంది. ఎన్నికల్లో విదేశీ జోక్యం అనేది మల్టీ కల్చరల్ సొసైటీ అయిన కెనడాలో సోషల్ కోఆర్డినేషన్ తగ్గించి కెనడియన్ల హక్కులకు భంగం కలిగేలా చేస్తుందని హెచ్చరించింది. తమ ఎన్నికలను చైనా, రష్యాలు ప్రభావితం చేస్తున్నాయని ఎప్పటినుంచో ఆరోపిస్తున్న కెనడా.. మొదటిసారి భారత్ పై ఆ తరహా ఆరోపణలు చేసింది.
అయితే, కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి సమర్పించిన తాజా నివేదికలో చైనానే అతిపెద్ద విదేశీముప్పుగా పరిగణించింది. 2019, 2021 ఫెడరల్ ఎన్నికలను రహస్యంగా మోసపూరితంగా ప్రభావితం చేయడానికి చైనా ప్రయత్నాలు చేసిందని నివేదికలో వెల్లడించింది. కాగా, గతేడాది తమ పౌరుడైన ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందని కెనడా ప్రధాని ట్రూడో పార్లమెంటు వేదికగా ఆరోపించారు. దీంతో భారత్, కెనడాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో కెనడా(Canada) భారత్ ను విదేశీముప్పుగా భావిస్తున్నట్లు ఆరోపించడం మరింత చర్చనీయాంశంగా మారింది.