ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు ఇండియన్స్ ని కెనడా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కరణ్ ప్రీత్ సింగ్, కమల్ ప్రీత్ సింగ్, కరణ్ బ్రార్ అనే ముగ్గురు వ్యక్తులను నిజ్జర్ హత్య కేసులో అరెస్ట్ చేసినట్లు కోర్టు నోటీసుల ద్వారా తెలుస్తోంది. 45 ఏళ్ల నిజ్జర్ ను 2023 జూన్ 18న సర్రేలో గురుద్వార బయట కొందరు దుండగులు కాల్చి చంపారు. హత్యకు పాల్పడిన వారు ప్రస్తుతం అరెస్టు చేసిన ముగ్గురు నిందితులు అని కెనడా పోలీసులు చెబుతున్నారు.
పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురు అనుమానితులు స్టూడెంట్ వీసాతో కెనడా వచ్చారని, భారత నిఘా వర్గాల ఆదేశాల మేరకు నిజ్జర్(Hardeep Nijjar) ను హత్య చేసి ఉండొచ్చని గ్లోబల్ న్యూస్ నివేదిక పేర్కొంది. 2023 మే 1న ఎడ్మంటన్, సర్రేలలో హత్యకు కుట్ర పన్నిన అభియోగాన్ని కూడా బ్రార్ పై మోపారు. పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురికి భారత ప్రభుత్వంతో సంబంధం ఉందని ధ్రువీకరించేందుకు కెనడా ప్రజా భద్రతా వ్యవహారాల మంత్రి డొమినిక్ లెబ్లాక్ నిరాకరించారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లే ఈ విషయాన్ని చెప్పగలరని అన్నారు. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని గతేడాది సెప్టెంబర్లో కెనడా(Canada) ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు బాగా బలహీనపడ్డాయి. ట్రూడో ఆరోపణలను అసంబద్ధమని, ప్రేరేపితమైనవని భారత్ కొట్టిపారేసింది.