Corona virus heavly spread again in China: చైనాను మరోసారి కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. వైరస్ బారి నుంచి క్రమంగా ఒక్కో దేశం కోలుకుంటుండగా.. చైనాలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా మారుతున్నాయి. ఇప్పటికీ కఠిన నియమాలతో లాక్‌డౌన్‌లు పాటిస్తున్నారు. ఎన్ని నిబంధనలు పెట్టినా, ఎంత కఠినంగా లాక్‌డౌన్‌లు అమలు చేస్తున్నా, కరోనా వ్యాప్తి మాత్రం అదుపులోకి రావటం లేదు. తాజాగా చైనాలో ఆరు నెలల తరువాత మళ్లీ కరోనా మరణం నమోదు అయ్యింది. ఈ మేరకు దేశ ఆరోగ్యశాఖ కరోనా మరణం సంభవించినట్లు ప్రకటించింది.
బీజింగ్‌కు చెందిన 87 ఏళ్ల వృద్ధుడు వైరస్ (Corona virus) కారణంగా చనిపోయినట్లు నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. తమ దేశంలో దాదాపు 92 శాతం మంది కనీసం ఒక్క డోసు అయినా కరోనా వ్యాక్సిన్ తీసుకుని ఉంటారని డ్రాగన్ దేశం ప్రకటించింది. కానీ వృద్ధులకు టీకాలు సరిగ్గా పంపిణీ చేయటం లేదనే అపవాదు స్థానికంగా ప్రచారం జరుగుతుంది. కొవిడ్ కఠిన ఆంక్షల కారణంగా ఝెంగ్‌జువాలో ఇటీవలే ఇద్దరు చిన్నారు మృతి చెందటంతో.. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చైనీయులు. దీంతో దిగి వచ్చిన డ్రాగన్ ప్రభుత్వం మూడేళ్ల కంటే వయసు తక్కువ ఉన్న వారిపై ఆంక్షలు సడలించి.. చిన్నారులకు కొవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ అవసరం లేదని స్పష్టం చేసింది.