China Landslide | చైనాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 47 మంది సజీవ సమాధి అయ్యారు. ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికితీశారు అధికారులు. వివరాల్లోకి వెళితే… యునాన్ ఫ్రావిన్స్ లోని లియాంగ్ షుయి గ్రామంలో దాదాపు 200 కుటుంబాలు జీవిస్తున్నాయి. అయితే ఈ గ్రామంలోని 18 ఇళ్లపై కొండ చరియలు విరిగిపడ్డాయి. 47 మంది ఆచూకీ తెలియడం లేదని, వీరంతా కొండ చరియల కింద సజీవ సమాధి అయినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. వీరంతా మృతి చెందినట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
కాగా ప్రమాదం జరిగిందని సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 200 మందిని సహాయక చర్యల్లోకి దింపారు. గాయపడిన వారిని అంబులెన్సుల్లో సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. దాదాపు 500 మంది గ్రామస్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. విరిగిపడిన కొండ చరియల(China Landslide) కింద గాలింపు కార్యక్రమాలు చేపట్టారు. ఆచూకీ లభించని వారికోసం వెతుకుతున్నారు. ఇప్పటి వరకూ 11 మంది మృతదేహాలను వెలికితీసినట్టు అధికారులు ధృవీకరించారు.