అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికన్లు గన్స్ కలిగి ఉండటానికి ఆయన మరోసారి మద్దతు తెలిపారు. “నవంబరు నెలలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో నేను గెలిస్తే.. అమెరికా నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (NRA) సభ్యుల తుపాకులపై ఎవరూ వేలు పెట్టకుండా చేస్తానని” ట్రంప్ హామీ ఇచ్చారు. శుక్రవారం జరిగిన NRA సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు. ఎన్ఆర్ఏ సీఈఓ వేన్ లా పియెర్ నిధుల దుర్వినియోగం ఆరోపణలతో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రైవేటు జెట్లు, విలాస బోట్లలో తిరగడం, ఆఫ్రికాలో జంతువులవేట, జల్సాలకు నిధుల్ని వేన్ దుబారా చేశారు. దీంతో NRA దివాలా పిటిషన్ వేసి, తన కార్యాలయాన్ని న్యూయార్క్ నుంచి టెక్సాస్ కు మార్చడానికి పర్మిషన్ ఇవ్వాలని కోరినా కోర్టు నిరాకరించింది.
ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఏ(NRA) సభ్యులు ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి ట్రంప్(Trump) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికాలో గన్ కల్చర్ కి మరోసారి మద్దతు తెలిపారు. తాను అధికారంలోకి వస్తే NRA సభ్యుల తుపాకులపై ఎవరినీ వేలు కూడా పెట్టనివ్వనన్నారు. కాగా, అమెరికన్లు ఆయుధాలు కలిగి ఉండటం రాజ్యాంగపరమైన హక్కనీ.. దీన్ని వదులుకోబోమని NRA వాదిస్తోంది. వీరికి ఎక్కువ శాతం రిపబ్లికన్లు మద్దతు ఇస్తుండగా, గన్ కల్చర్ వల్ల అమాయక ప్రజలు నిరంతరం ప్రాణాలు కోల్పోతున్నారని.. దీనికి అడ్డుకట్ట వేయాలని డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ విషయంలో డెమోక్రాట్లకు బలం లేకపోవడం వలన వారి ప్రయత్నాలు విఫలమవుతున్నాయి.