భారతదేశానికి, మాల్దీవుల( Maldives)కి మధ్య దౌత్యపరమైన విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాల్దీవుల నుంచి అనూహ్య అడుగు పడింది. దీనికి భారత గణతంత్ర దినోత్సవం వేదిక అయింది. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజు(Mohamed Muizzu) రిపబ్లిక్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు భారత రాష్ట్రపతికి, ప్రధాన మంత్రికి సందేశం పంపినట్లు మాల్దీవుల అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
భవిష్యత్తులో భారత ప్రజలు శాంతి, అభివృద్ధి, సంపదలతో తులతూగాలని మొయిజు ఆకాంక్షించినట్టు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్న స్నేహాన్ని, పరస్పర బంధాన్ని గౌరవాన్ని మొయిజు గుర్తు చేసుకున్నట్లు అధ్యక్ష కార్యాలయం తెలిపింది. మాల్దీవుల(Maldives) మాజీ ప్రెసిడెంట్, భారత మిత్రుడు ఇబ్రహీం సోలి కూడా భారత్ కు విషెస్ తెలియజేశారు. రెండు దేశాల మధ్య విడదీయరాని స్నేహబంధం ఉందని, రానున్న రోజుల్లో అది మరింత బలపడాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.