ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) రాష్ట్రంలో 10 లాంగ్వేజెస్ ప్రమోట్ చేయబోతున్నాం అంటూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పై(MK Stalin) కౌంటర్ ఎటాక్ చేసారు. కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యావిధానం(National Education Policy) 2020 త్రిభాషా విధానాన్ని స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ని అమలుపరిచేందుకు తమిళనాడు ప్రభుత్వం నిరాకరిస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెలుగు, ఇంగ్లీష్ , హిందీ త్రిభాషా విధానం అమలు చేస్తామని నొక్కి చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో 10 భాషలను నేర్చుకునేందుకు ప్రోత్సహిస్తామని తెలిపారు. దానికోసం ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
“జ్ఞానం వేరు, భాష వేరు. 5 -10 అంతర్జాతీయ భాషలను ప్రవేశబెట్టబోతున్నాం. వాటిని నేర్చుకోండి. వెళ్లి ఆయాప్రాంతాల్లో పని చేసుకోండి” అని చంద్రబాబు సూచించారు. మూడు భాషలే కాదు, బహుభాషా విధానం ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. భారతదేశం అంతటా మెరుగైన కమ్యూనికేషన్ కోసం విద్యార్థులు హిందీ నేర్చుకోవాలని చంద్రబాబు(Chandrababu) అభిప్రాయపడ్డారు. జీవనోపాధి కోసం అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా అవసరం అని అన్నారు. దేశ ప్రజలతో కలిసిపోవడానికి హిందీ భాష ముఖ్యంగా నేర్చుకోవడం మంచిదని, అందులో తప్పేమి లేదని ఆయన చెప్పారు.
NEP 2020 నిర్దేశించిన త్రిభాష విధానంలో(Three Language Policy) హిందీ బోధనను తప్పనిసరి చేయలేదు. ఆయా రాష్ట్రాలలో 5వ తరగతి వరకు పిల్లలకు మాతృభాష విద్యను పరిచయం చేయాలని సూచించింది. అదేవిధంగా ఇంగ్లీష్ తోపాటు ఏదైనా ఇతర భారతీయ భాషను నేర్చుకోవాలని పిలుపునిచ్చింది.
తమిళనాడు.. తెలుగు, మలయాళం, కన్నడ లేదా ఏదైనా ఇతర భాషను ప్రవేశపెట్టడం ద్వారా త్రిభాష విధానాన్ని అమలు చేయవచ్చు. అయితే, డిఎంకె హిందీ భాషను రాష్ట్రాలపై బలవంతంగా రుద్దుతున్నారంటూ కేంద్రంపై విరుచుకుపడుతుంది. తమిళనాడు లోని శంకరన్ కోయిల్, పొల్లాచి, పాలయంకోట్టై రైల్వే స్టేషన్లతో సహా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, భవనాల బోర్డులపై హిందీ పదాలను డిఎంకె కార్యకర్తలు ధ్వంసం చేసారు.
Read Also: అన్నం ఒక పట్టు పట్టేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!
Follow Us : Google News, Twitter, Share Chat