Alltimereport : ‘మొహమ్మద్’ అనే పేరు నచ్చకపోవడంతో ఉబెర్ డ్రైవర్(Uber Driver)పై ఓ ప్రయాణికుడు దాడి చేశాడు. సీటు బెల్ట్‌తో గొంతు నులిమేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఉబర్ డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అమెరికాలోని మిన్నియాపొలిస్‌లో నవంబర్ 14న జరిగింది. 51 ఏళ్ల మొహమ్మద్ యూసఫ్‌పై సీట్బెల్ట్తో గొంతు నులిమి, కారుతో తొక్కించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పటి నుంచి యూసఫ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐదు శస్త్రచికిత్సలు చేసినా శనివారం ఉదయం చికిత్స పొందుతూ మరణించాడు. యూసఫ్ ప్రయాణికుడిని ఎక్కించుకున్న సమయంలో తన సోదరుడితో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ప్రయాణికుడు మొహమ్మద్ అనే పేరు తనకు నచ్చదని అన్నట్లు కోర్టు పత్రాల్లో పేర్కొన్నారు. ఆ తర్వాత యూసఫ్ గొంతు నులిమి, అతడి కారుతో తొక్కించి గోతిలో పడేసినట్లు ఆరోపణలున్నాయి. ఫోన్లో ఉన్న సోదరుడు యూసఫ్ అరుపులు విన్నాడు.
ఈ ఘటనలో 25 ఏళ్ల సమిత్ అపూర్వ పటేల్‌పై తొలుత హత్యాయత్నం, కారు దొంగతనం కేసులు నమోదయ్యాయి. యూసఫ్ (Uber Driver) మృతి నేపథ్యంలో హత్యాయత్నం అభియోగాన్ని రెండో స్థాయి ఉద్దేశపూర్వక హత్యగా మార్చనున్నట్లు కౌంటీ అటార్నీ తెలిపారు. నిందితుడి న్యాయవాది మృతిపై విచారం వ్యక్తం చేస్తూ, విచారణ పూర్తయ్యే వరకు తొందరపడి నిర్ణయానికి రావద్దని కోరారు. యూసఫ్ 1993లో అమెరికాకు వచ్చి చాలా ఏళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన మృతితో సోమాలీ కమ్యూనిటీలో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఈ దాడి జాతి విద్వేషంతో జరిగిందని నిర్ధారించేందుకు ఆధారాలు లేవని అధికారులు తెలిపారు.
Also Read : డీలిమిటేషన్ బిల్లు: స్టాలిన్‌ను ఒప్పించడానికి రంగంలోకి రాహుల్
Follow Us On: Whatsapp


