దేశంలో పాజిటీవ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.. ఈ సమయంలో అన్నీ రాష్ట్రాల్లో కూడా టెస్టుల సంఖ్య పెంచారు… కేసులు మాత్రం భారీగా నమోదు అవుతున్నాయి. ఈ సమయంలో మరోసారి లాక్ డౌన్ విధించాలి అని చాలా మంది కోరుతున్నారు, అయితే దీనిపై మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సమయంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. వైరస్ కట్టడికి చేయాల్సిన పనులపై ఈ రెండు రోజుల సమావేశంలో చర్చించనున్నారు. నేడు కొందరు ముఖ్యమంత్రులు రేపు కొందరు ముఖ్యమంత్రులతో భేటీ అవ్వనున్నారు.
అయితే ఈ సమావేశానికి హాజరుకాలేనని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఆయన ప్రధాని కార్యాలయానికి చేరవేశారు. దీనికి కారణం ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఈ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నందున తాను కచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. అయితే ఈ రెండు రోజుల తర్వాత ప్రధాని మోదీతో సీఎం జగన్ నేరుగా ఫోన్ లో చర్చించనున్నారు అని తెలుస్తోంది.