ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వేళ ఓ వైసీపీ నేత ఇంట్లో విషాదం అలముకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ కీలకనేత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. శివప్రసాద్ తండ్రి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్బారెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సుబ్బారెడ్డి మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రేపు ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయని తెలుస్తోంది.
సుబ్బారెడ్డి 2004లో దర్శి కాంగ్రెస్ టిక్కెట్ ఆశించారు. అయితే అధిష్టానం టికెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచిన బూచేపల్లి తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. 2009లో బూచేపల్లి కుమారుడు శివప్రసాద్ రెడ్డి దర్శి నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే 2014లో వైసీపీ నుంచి పోటీచేసిన శివప్రసాద్ రెడ్డి ఓటమి చెందారు. సుమారు పదేళ్లుగా పైగా రాజకీయాల్లో ఉన్న శివప్రసాద్ రెడ్డి జిల్లాలో కీలక నేతగా ఎదిగారు. కాగా.. సుబ్బారెడ్డి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఒకరు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి రాజకీయాల్లో ఉండగా.. మరొకరు కమలాకర్ సినీ హీరోగా ఉన్నారు. మూడు సినిమాలు తీసిన కమాలకర్ అనారోగ్యంతో ఐదేళ్ల క్రితం చనిపోయారు. ఇదిలా ఉంటే.. సుబ్బారెడ్డి భార్య వెంకాయమ్మ చీమకుర్తి ఎంపీపీగా పనిచేశారు.