ఆమెకు రాజధాని హైదరాబాద్ నగరంలో గొప్ప హోదాతో కూడిన కొలువు. నెల నెలా మంచి జీతం.. అంతేకాదు తీసుకోవాలి అనుకుంటే అక్కడో ఇక్కడో లంచాలు దొరుకుతయ్. కానీ ఆ ఆపీసరమ్మ ఇజ్జత్ పోగొట్టుకునే పనిచేసింది. తలెత్తుకుని బతకాల్సిన ఆమె తల దించుకుని పోలీసుల ముందు నిలబడాల్సి వచ్చింది. శవాల మీద పేలాలు ఏరుకుని తినే రకం అని అనంగా వినడమే కానీ… నిజంగా అయితే ఎవరూ చూసి ఉండరు. కానీ ఇలాంటి పనిచేసినవాళ్లను చూసే ఆ పేరు వచ్చేందేమో అనిపించకమానదు. ఇంతకూ అసలు విషయం ఏమంటారా? తప్పక చదవండి.
జిహెచ్ఎంసిలో కాప్రా సర్కిల్ లో మహాలక్ష్మి అనే మహిళ డి.ఇ.గా పనిచేస్తున్నారు. మల్లాపూర్ జిహెచ్ఎంసిలో పనిచేసే చిన్న ఉద్యోగి స్వీపర్ రాములు ఇటీవల మరణించారు. అయితే రాములు ఉద్యోగం ఆయన భార్య సాలమ్మకు వచ్చింది. చనిపోయిన తన భర్త ఉద్యోగం తనకు ఇప్పించినందుకు 20వేలు ఇవ్వాలని డి.ఇ మహాలక్ష్మి డిమాండ్ చేసింది. అంత డబ్బు ఇవ్వలేక సాలమ్మ విషయాన్ని తన కొడుకు శ్రీనివాస్ కు చెప్పింది.
దీంతో శ్రీనివాస్ మన ఉద్యోగం మనకొస్తే ఆమెకు డబ్బులు ఇచ్చేదేంటి? అని నేరుగా ఎసిబి అధికారులను ఆశ్రయించారు. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు డి.ఇ. అసిస్టెంట్ విజయ్ అనే వ్యక్తి మల్లాపూర్ లోని యాదగిరి ఫంక్షన్ హాల్ దగ్గర 20వేల రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
అనంతరం ఎసిబి అధికారులు డి.ఇ. మహాలక్ష్మి కార్యాలయంలో, నాగారం చక్రిపురి కాలనీలోని తన నివాసంలో సోదాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె నివాసంలో బంగారు, నగదు గుర్తించారు. సాయంత్రం వరకు సోదాలు పూర్తి చేసిన తర్వాత అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని ఎసిబి డిఎస్పీ సూర్యనారాయణ మీడియాకు తెలిపారు.