నూనూగు మీసాల వయసులో వచ్చి : ఎల్ రమణకు టిడిపి కార్యకర్త వీడ్కోలు ఇలా..

0
118
//…వీడ్కోలు…//
నూనూగు మీసాల యువకుడిగా, కాలేజి విద్యార్థిగా, అన్నగారి పిలుపుతో రాజకీయ ప్రవేశం చేసిన మీరు, కార్యకర్త స్థాయి నుండి జిల్లా బాద్యుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అతిసామాన్య చేనేత కుటుంబంలో పుట్టిన బలహీన వర్గాల బిడ్డ ఇంతెత్తుకు ఎదగడం ఒక అద్భుతం.
పార్టీ ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని, పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి మీరు ఎదిగిన క్రమం ప్రతి కార్యకర్తకు ఆదర్శనీయం.
మీరు కూడా ప్రతీ వేదికపై ఇవే మాటలు పలుమార్లు పునరుద్ఘాటించారు.
మీరు ఇలా పార్టీని వీడి వెళ్లిపోతారని ఎన్నడూ ఊహించలేదు. బహుశా మీరు కూడా ఎప్పుడూ అనుకొని ఉండరు.
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పాలన నియంతృత్వానికి పరాకాష్ట, దానిపై మీరు పోరాటం చేస్తారని ఉహించాం. కానీ చివరకు మీరే ఆ పక్కకు వెళతారని అస్సలు ఊహించలేదు.
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజాకూటమి తరపున మీరు చెప్పిన మాటలు ఇంకా మా చెవుల్లో మొగుతూనే ఉన్నాయి.”కేసీఆర్ నిర్మించుకున్న నయా గడి ప్రగతి భవన్ ను ప్రజా ఆస్పత్రిగా మార్చుతాం” అన్నారు. దొరతనాన్ని మట్టిగలపడానికి మీరు రగిల్చిన స్ఫూర్తిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము కొనసాగిస్తాం, మీ మాటను నిలబెడుతాం.
దొరతనాన్ని ఎదిరించి, సామాజిక తెలంగాణ లక్ష్యాలను సాధించే క్రమంలో మీరు మా రాజకీయ ప్రత్యర్థుల పక్షాన ఉండవచ్చు, అయినా సరే మీరు నేర్పిన క్రమశిక్షణ, రాజకీయ విలువలతోనే ప్రత్యర్థులపై యుద్ధం చేస్తాం.
ఈ యుద్ధంలో అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదే, న్యాయ నిర్ణేతలు ప్రజలే.
వీడ్కోలు…
మీ అభిమాని,
తెలుగుదేశం పార్టీ జీవితకాల కార్యకర్త,
సంతోష్ కుమార్ లిక్కి.
టిడిపి కార్యకర్త రాసిన ఫేస్ బుక్ పోస్టు లింక్ కింద ఉంది చూడొచ్చు…