ఐపీఎల్‌: కోల్‌కతా అద్బుత ప్రదర్శన..రాజస్థాన్ చిత్తు

0
109

ఐపీఎల్‌లో భాగంగా గతరాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ అద్బుత ప్రదర్శన చేసింది. ఆల్‌రౌండర్ ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఫలితంగా ఈ బెర్తు కోసం ఎదురు చూస్తున్న ముంబై ఇండియన్స్ ఆశలు అడియాసలే అయ్యాయి. ఫలితంగా నేడు జరగనున్న రెండు మ్యాచ్‌లు నామమాత్రమే కానున్నాయి.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 171 పరుగుల భారీ స్కోరు చేసింది. శుభమన్‌గిల్ 56, వెంకటేశ్ అయ్యర్ 38, నితీశ్ రాణా 12, త్రిపాఠి 21 పరుగులు చేయగా, కార్తీక్ 14, కెప్టెన్ మోర్గాన్ 13 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

అనంతరం 172 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌పై కోల్‌కతా బౌలర్లు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా శివమ్ మావీ, లాకా ఫెర్గ్యసన్‌లు బంతితో చెలరేగిపోయారు. ఎడాపెడా వికెట్లు తీస్తూ బ్యాట్స్‌మెన్‌ను కుదురుకోనివ్వలేదు. ఫలితంగా మరో 3.5 ఓవర్లు మిగిలి ఉండగానే 85 పరుగులకు రాజస్థాన్ ఆలౌటై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

శివమ్ మావీ నాలుగు, ఫెర్గ్యూసన్ 3 వికెట్లు తీసుకున్నారు. శివమ్ మావీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ క్రమంలో నేటి మ్యాచ్‌లో హైదరాబాద్‌పై ముంబై విజయం సాధించినా ప్లే ఆఫ్స్ అవకాశం లేదు. ఎందుకంటే, కోల్‌కతా నెట్ రన్‌రేట్ చాలా మెరుగ్గా ఉంది. కాబట్టి నేడు జరగనున్న రెండు మ్యాచ్‌లు నామమాత్రమే కానున్నాయి.