నేడే ఐపీఎల్ ఫైనల్..విజేత ఎవరో?

0
68

ఐపీఎల్‌14వ సీజన్ ట్రోఫీ కోసం చెన్నై సూపర్‌కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. లీగ్ దశల్లో అద్భుత ఆటతీరుతో ఫైనల్‌ చేరిన ఇరు జట్లు కీలక పోరాటానికి సిద్ధమయ్యాయి. ఐపీఎల్‌లో ఇప్పటివరకు మూడుసార్లు ట్రోఫీ గెలిచిన చెన్నై..రెండు సార్లు కప్పు ముద్దాడిన కేకేఆర్ జట్లు మరో టైటిల్‌ను తమఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నాయి. ఇరుజట్ల మధ్య తుది పోరు శుక్రవారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.

ఐపీఎల్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ఒక టోర్నీని రెండు అంచెలుగా నిర్వహించారు. ఎట్టకేలకు అన్ని మ్యాచ్‌లు పూర్తి చేసుకొని రెండు జట్లు ఫైనల్‌కు దూసుకెళ్లాయి. అవే చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌.

చెన్నై సూపర్​ కింగ్స్​ జట్టు కూర్పు విషయంలో..కెప్టెన్​ ధోనీ వ్యూహాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఫామ్‌లో లేక తంటాలు పడుతున్న స్టార్​ బ్యాటర్ సురేశ్‌ రైనా స్థానంలో..ఉతప్పను తొలి క్వాలిఫయర్‌ తుదిజట్టులోకి తీసుకుని ధోనీ ఫలితం రాబట్టాడు. బ్రావో, డుప్లెసిస్, రాయుడు, ఉతప్ప, మొయిన్ అలీ, జడేజా వంటి సీనియర్ల అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని యాజమాన్యం భావిస్తోంది. జోష్ హెజిల్‌వుడ్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్‌లతో కూడిన బౌలింగ్ దళం కూడా బలంగా కనిపిస్తోంది. ఐతే..కోల్​కతా స్పిన్ త్రయం వరుణ్ చక్రవర్తి, షకిబ్, సునీల్ నరైన్‌ను ఎలా ఎదుర్కొంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.

ఇప్పటివరకు ఐపీఎల్‌లో 8 సార్లు ఫైనల్‌కు చేరుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐదుసార్లు ఓడిపోగా..కోల్​కతా నైట్​రైడర్స్​ మాత్రం ఫైనల్‌కు చేరిన రెండుసార్లు కప్‌ నెగ్గింది. ఈ సీజన్‌లో భాగంగా భారత్‌లో జరిగిన తొలి అంచెలో ఆడిన 7 మ్యాచుల్లో 2 మాత్రమే గెలిచిన కోల్‌కతా రెండో అంచెలో అందుకు పూర్తి భిన్నమైన ఫలితాలు రాబట్టింది. స్పిన్‌ త్రయం..వరుణ్ చక్రవర్తి, షకిబ్, నరైన్ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసివస్తోంది. ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ సహా మిగిలిన బ్యాటర్లు రాణిస్తుండం కలిసొచ్చే అంశం. గాయపడ్డ రసెల్​ స్థానంలో జట్టులోకి వచ్చిన షకిబ్‌ జట్టుకు సమతూకం తెస్తున్నాడు. ఫైనల్‌ ఒత్తిడిని తట్టుకుని విజయదశమి రోజున ఏ జట్టు విజయం సాధిస్తుందోనని క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు.