ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రోజు పోటీల్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్ సింధు తొలి రౌండ్లో విజయం సాధించగా..సైనా నెహ్వాల్ మ్యాచ్ మధ్యలో గాయం కారణంగా రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగి ఇంటిముఖం పట్టింది. సింధు 21-15, 21-18తో జూలీ జాకోబ్సెన్ (డెన్మార్క్)పై నెగ్గి రెండో రౌండ్లోకి ప్రవేశించింది.
సయాక టకాషి (జపాన్)తో తలపడిన సైనా 11-21తో తొలి గేమ్‌లో ఓడిపోగా రెండో గేమ్‌లో 2-9 స్కోరు వద్ద గాయంతో తప్పుకొంది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ టాప్ సీడ్ కెంటో మొమోట (జపాన్) చేతిలో పోరాడి ఓడాడు. గంట 20 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో శ్రీకాంత్ 18-21, 22-20, 19-21తో పరాజయం పాలయ్యాడు.
ఇక, పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో సమీర్ వర్మ, లక్ష్యసేన్, సౌరభ్ వర్మ ముందంజ వేయగా పారుపల్లి కశ్యప్, హెచ్‌ఎ్‌స ప్రణయ్ ఓటమి చవిచూశారు. పురుషుల డబుల్స్‌లో ఎంఆర్ ఆర్జున్-ధ్రువ్ కపిల జోడీ, సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ద్వయం, మిక్స్‌డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-అశ్వినీ పొన్నప్ప జంట అద్భుత విజయాలతో రెండో రౌండ్లోకి దూసుకెళ్లాయి.