కోల్‌కతాలో జరిగిన ఫైనల్ టీ 20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంతో రోహిత్ సేన 3-0తో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 73 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీ20 ఫార్మాట్‌లో పూర్తి స్థాయి కెప్టెన్‌గా మారిన రోహిత్ శర్మ, కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో టీమిండియాకు ఇదే తొలి విజయం.
అయితే, విజయానంతరం రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ..శుభారంభం చేయడం ఎప్పుడూ మంచిదే. అయితే ఈ సిరీస్‌లో అందరూ బాగా ఆడారని, ఈ విజయం తర్వాత కూడా మన పాదాలను నేలపై నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని’ టీం సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.
‘ఇది గొప్ప సిరీస్ విజయం. సిరీస్‌లో అందరూ బాగా ఆడారు. విజయంతో ప్రారంభించడం మంచి అనుభూతిని కలిగిస్తుంది. అయితే మనం వాస్తవికతను చూడాలి. గెలిచిన తర్వాత ధీమా పెరిగితే, తరువాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది’ అని పేర్కొన్నాడు.
టీ20 సిరీస్‌ను చేజిక్కించుకున్న తర్వాత ద్రవిడ్ దృష్టి నవంబర్ 25 నుంచి కాన్పూర్‌లో ప్రారంభం కానున్న తొలి టెస్టుపైనే ఉంటుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కాన్పూర్‌లో ప్రారంభం కానుంది.