దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరే ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ నిరాకరించాడు. ఈ విషయాన్ని క్రికెట్ బోర్డ్ పరిష్కరిస్తుందని చెప్పాడు.
కోహ్లీని వన్డే సారథ్యం నుంచి తప్పించిన తర్వాత వివాదం చెలరేగడం వల్ల బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మీడియాతో మాట్లాడుతూ..కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొంటానని చెప్పినప్పుడు తాము వారించామని అన్నాడు.
అయినా, విరాట్ తన నిర్ణయానికే కట్టుబడ్డాడని చెప్పాడు. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా పర్యటనకు జట్టును ఎంపిక చేసే ముందు పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఇద్దరు సారథులు ఉండకూడదని సెలక్షన్ కమిటీ భావించిందని దాంతో ఆ నిర్ణయం తీసుకుందని తెలిపాడు. ఈ విషయాన్ని కోహ్లీకి ముందే వెల్లడించినట్లు గంగూలీ పేర్కొన్నాడు.
అయితే, గంగూలీ చెప్పిన మాటలకు కోహ్లీ చెప్పిన మాటలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. టెస్టు సిరీస్‌కు జట్టు ఎంపిక కోసం ఈ నెల 8న జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశానికి గంటన్నర ముందు మాత్రమే సెలక్టర్లు తనతో మాట్లాడారని తెలిపాడు. టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగిన తర్వాత తనతో ఎవరూ మాట్లాడలేదని అన్నాడు.