ఐపీఎల్: సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కడ లోపాలున్నాయో గుర్తించింది. వ్యూహ వైఫల్యాలను లెక్కించింది. ఇప్పుడు దిగ్గజాలతో సన్‌రైజర్స్‌ను పరిపుష్టిగా మార్చింది. ఈ సీజన్ ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. నిజం చెప్పాలంటే లీగ్‌లోనే చెత్త ప్రదర్శన చేసి అట్టడుగున నిలిచింది.
వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారాను వ్యూహాత్మక సలహాదారుగా నియమిస్తూ అతనికి బ్యాటింగ్ కోచ్ బాధ్యతలు కూడా అప్పగించింది. దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్ దిగ్గజం డేల్ స్టెయిన్‌ను ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ సహాయ బృందాన్ని నడిపించనున్నారు. ఈ సీజన్‌లో జట్టు క్రికెట్ డైరెక్టర్ పాత్రకే పరిమితమైన మూడీని ఎస్‌ఆర్‌హెచ్ మళ్లీ హెడ్ కోచ్‌గా నియమించింది.
భారత మాజీ బ్యాటర్ హేమంగ్ బదానిని ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపిక చేశారు. శ్రీలంక మేటి ముత్తయ్య మురళీధరన్‌ను స్పిన్ బౌలింగ్ కోచ్‌గా కొనసాగించనుంది. మెగా వేలానికి ముందు రిటెయిన్ జాబితాలో కెప్టెన్ కేన్ విలియమ్సన్, అన్‌క్యాప్డ్ ఉమ్రాన్ మలిక్, అబ్దుల్ సమద్‌లను అట్టిపెట్టుకున్న ఎస్‌ఆర్‌హెచ్ డాషింగ్ ఓపెనర్ వార్నర్ సహా అందరినీ విడుదల చేసింది.